నారా లోకేశ్ కృషితో విశాఖ విమల విద్యాలయానికి పూర్వ‌వైభ‌వం

  • ఆర్ఐఎన్ఎల్ నిధులు నిలిపివేయడంతో మూతపడిన విమల విద్యాలయం
  • మంత్రి నారా లోకేశ్ ప్రత్యేక కృషితో పునఃప్రారంభం
  • పాఠశాల నిర్వహణ బాధ్యతలను స్వీకరించిన రాష్ట్ర విద్యాశాఖ
  • ప్రారంభం రోజే వందల సంఖ్యలో విద్యార్థుల ప్రవేశాలు
  • విశాఖ వ్యాలీ స్కూల్ మోడల్‌లో నిర్వహణకు ప్రభుత్వ నిర్ణయం
విశాఖపట్నం ఉక్కునగరంలో నాలుగు దశాబ్దాలుగా విద్యా వెలుగులు పంచుతున్న విశాఖ విమల విద్యాలయం మళ్లీ విద్యార్థులతో కళకళలాడుతోంది. రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ (ఆర్ఐఎన్ఎల్) ఆర్థిక సహాయం నిలిపివేయడంతో గత జూన్ నెలలో మూతపడిన ఈ పాఠశాల, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ప్రత్యేక చొరవతో పునఃప్రారంభమైంది. రాష్ట్ర ప్రభుత్వమే నేరుగా పాఠశాల నిర్వహణ బాధ్యతలను స్వీకరించడంతో వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా లభించింది.

ప్రభుత్వ ఆధ్వర్యంలోకి పాఠశాల

విశాఖ స్టీల్ ప్లాంట్ టౌన్‌షిప్‌లోని విమల విద్యాలయం ఆర్థిక ఇబ్బందుల కారణంగా మూతపడటంపై స్థానిక ఎమ్మెల్యే, టీడీపీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తీవ్రంగా స్పందించారు. ఈ విషయాన్ని ఆయన నేరుగా మంత్రి నారా లోకేశ్ దృష్టికి తీసుకెళ్లి, పాఠశాలను ఎలాగైనా తెరిపించాలని కోరారు. తక్షణమే స్పందించిన మంత్రి లోకేశ్, దీన్ని కేవలం ఒక పాఠశాల సమస్యగా కాకుండా, ఒక చారిత్రక విద్యాసంస్థను కాపాడే బాధ్యతగా తీసుకున్నారు. ఈ విద్యా సంవత్సరం నుంచే తరగతులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. 

మంత్రి ప్రత్యక్ష పర్యవేక్షణలో ప్రభుత్వ శాఖలన్నీ సమన్వయంతో పనిచేయడంతో పాఠశాల పునఃప్రారంభానికి మార్గం సుగమమైంది. విశాఖ వ్యాలీ స్కూల్ నమూనాలో జిల్లా కలెక్టర్ ఛైర్మన్‌గా ఈ విద్యాలయాన్ని నడిపి, పూర్వ వైభవం తీసుకురావాలని మంత్రి లోకేశ్ దిశానిర్దేశం చేశారు.

రికార్డు స్థాయిలో ప్రవేశాలు

మంత్రి ఆదేశాల మేరకు జూన్ 12న విశాఖపట్నం జిల్లా కలెక్టర్ అభిషిక్త్ కిశోర్, ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు పాఠశాలను లాంఛనంగా పునఃప్రారంభించారు. ప్రారంభించిన వెంటనే పాఠశాలలో ప్రవేశాలు వెల్లువెత్తాయి. యూకేజీలో 55 మంది, 1 నుంచి 10వ తరగతి వరకు 723 మంది విద్యార్థులు చేరారు. ప్రారంభం రోజే ఇంత పెద్ద సంఖ్యలో విద్యార్థులు చేరడం ఈ విద్యాలయంపై ప్రజలకు ఉన్న నమ్మకాన్ని తెలియజేస్తోంది. అంతేకాకుండా, మంత్రి లోకేశ్ ఆదేశాలతో పాఠశాలలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని కూడా వెంటనే ప్రారంభించారు.

పాఠశాల చరిత్ర.. ప్రభుత్వ భరోసా

విశాఖ ఉక్కు కర్మాగారం ఉద్యోగుల పిల్లలకు నాణ్యమైన ఉచిత విద్య అందించే లక్ష్యంతో ఆర్ఐఎన్ఎల్, ఆర్ సీఎం డయాసిస్‌తో కలిసి 1984లో విశాఖ విమల విద్యాలయాన్ని ప్రారంభించింది. కాలక్రమేణా కాంట్రాక్ట్ కార్మికులు, నిర్వాసితులు, పేద కుటుంబాల పిల్లలకు సైతం ఈ పాఠశాల విద్యను అందించింది. 

ఆర్ఐఎన్ఎల్ నిధులు ఆగిపోవడంతో మూసివేత నాటికి సుమారు 2,200 మంది విద్యార్థులు, 100 మంది సిబ్బంది భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు కూటమి ప్రభుత్వం కృషి చేసిన స్ఫూర్తితోనే, అందులోని ఈ పాఠశాలను కూడా కాపాడాలని మంత్రి లోకేశ్ సంకల్పించారు. ఆయన కృషితో నేడు ఈ విద్యాలయం రాష్ట్ర విద్యాశాఖ ఆధ్వర్యంలోకి వచ్చి, విద్యార్థులు, సిబ్బందికి భవిష్యత్తుపై భరోసా కల్పించింది.

Nara Lokesh
Vimala Vidyalayam Visakhapatnam
Visakhapatnam Steel Plant School
Andhra Pradesh Education Minister
Palla Srinivasa Rao
RINL School Reopening

More Telugu News